Nagarjuna’s Geethanjali Re-Release Date Locked, Cult Classic Returns to Theatres

D News | అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే కాదు.. తెలుగు సినీ చరిత్రలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం ‘గీతాంజలి’. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించింది. 1989లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమాలోని ప్రేమకథ, సంగీతం, పాత్రలు, భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే ‘గీతాంజలి’ని అభిమానులు ఓ కల్ట్ క్లాసిక్‌గా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధురమైన ప్రేమకథ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

నవంబర్ 13న థియేటర్లలోకి..

నాగార్జున నటించిన ‘గీతాంజలి’ని నవంబర్ 13న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను మరోసారి పెద్ద తెరపై చూసి ఆస్వాదించాలంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ ప్రకటనతో నాగార్జున అభిమానుల్లో సందడి మొదలైంది. ముఖ్యంగా పాత సినిమాలను థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఇష్టపడే సినీ ప్రియులకు ‘గీతాంజలి’ రీ-రిలీజ్ మరో మంచి అవకాశం కానుంది.

గతంలోనూ రీ-రిలీజ్‌కు ప్లాన్..

నిజానికి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29కి ఒక రోజు ముందుగా.. అంటే ఆగస్టు 28న ‘గీతాంజలి’ని రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ గతంలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పట్లో వచ్చింది. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాలతో సినిమా రీ-రిలీజ్ వాయిదా పడింది.

తాజాగా మరోసారి విడుదల తేదీని ఖరారు చేసిన చిత్రబృందం.. నవంబర్ 13న ‘గీతాంజలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మణిరత్నం దర్శకత్వం, నాగార్జున నటన, ఇళయరాజా సంగీతం, అద్భుతమైన ప్రేమకథ.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అంశం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ క్లాసిక్ మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో అప్పట్లో సినిమాను చూసిన ప్రేక్షకులతో పాటు.. కొత్త తరం సినీ అభిమానులు కూడా ‘గీతాంజలి’ మ్యాజిక్‌ను పెద్ద తెరపై మరోసారి ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.

By Avinash