
D News | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
తాజాగా పెన్ స్టేట్ ఫిల్మ్‌మేకింగ్ విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటీనటుల ఎంపిక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్టార్‌ను చూసి నటుడిని ఎంపిక చేయను..
ఓ నటుడిని కేవలం అతడికి ఉన్న స్టార్‌డమ్‌ను చూసి తాను ఎంపిక చేసుకోనని రాజమౌళి తెలిపారు. “ఒక నటుడు సూపర్‌స్టార్ అనే కారణంతో మాత్రమే నేను అతడిని నా సినిమాలో తీసుకోను. పాత్రకు నిజంగా సరిపోయే నటుడినే ఎంచుకుంటాను. ఒకసారి నటుడిని ఎంపిక చేసుకున్న తర్వాత.. అతను నాపై నమ్మకం ఉంచాలని కోరుకుంటాను. పాత్రకు కావాల్సిన నటనను అతడి నుంచి రాబట్టేందుకు నేను మార్గనిర్దేశం చేస్తాను” అని చెప్పారు.
మహేశ్ నా అంచనాలను మించిపోయారు..
ఇక మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “మహేశ్ బాబు భారీ సూపర్‌స్టార్. ‘వారణాసి’ కోసం ఆయన నుంచి 100 శాతం పనితీరును ఆశించాను. కానీ ఆయనతో కలిసి పని చేయడం మొదలుపెట్టిన తర్వాత నా అంచనాలను పూర్తిగా మించిపోయారు. నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా చేశారు” అని తెలిపారు.
మహేశ్ బాబు తన పాత్రకు తీసుకొచ్చిన కొత్త కోణాలు తనను ఆశ్చర్యపరిచాయని రాజమౌళి చెప్పారు. తాను ఊహించిన దానికంటే మరింత అద్భుతంగా పాత్రను ఆయన పండించారని పేర్కొన్నారు.
“మహేశ్ ఆ పాత్రకు 200 శాతం ఇచ్చారు. ఆయన తీసుకొచ్చిన కొత్త కోణాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అందుకే ‘వారణాసి’లో మహేశ్ బాబుతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవంగా మారింది” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
