
D NEWS: తనపై క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఎదుట హరీశ్‌రావు తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
కుటుంబసమేతంగా ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే వాటిని క్షుద్రపూజలుగా చిత్రీకరించారని హరీశ్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రచారం ద్వారా తన భక్తిని, వ్యక్తిత్వాన్ని హేళన చేశారని ఆయన పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ క్షుద్రపూజల అంశంపై తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా తాను క్షుద్రపూజలు చేశానంటూ తనపై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యల వల్ల సమాజంలో తన ప్రతిష్ట, పరువుకు భంగం కలిగిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోర్టును కోరారు. ఈ కేసులో ఆయన స్టేట్‌మెంట్ రికార్డు కావడంతో తదుపరి న్యాయ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.
