
D Educt: Sept 29: మధ్యాహ్న భోజనంపై సర్వే
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పథకం అమలుపై అభిప్రాయాలను సేకరించారు.
సర్వేలో పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా సంతృప్తి శాతాన్ని పరిశీలించగా విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
జిల్లాల వారీగా సంతృప్తి శాతం
విశాఖపట్నం జిల్లాలో మధ్యాహ్న భోజనంపై 80.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం 77.5 శాతం, మన్యం 76.9 శాతం, పోలవరం 76.7 శాతం, విజయనగరం 76.5 శాతం సంతృప్తి శాతాన్ని నమోదు చేశాయి.
మరికొన్ని జిల్లాల్లో సంతృప్తి శాతం కొంత తక్కువగా నమోదైంది. అనంతపురంలో 68.2 శాతం, కర్నూలులో 69.3 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 70.2 శాతం మంది సానుకూల అభిప్రాయం తెలిపారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 71.4 శాతం మంది మధ్యాహ్న భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోంది. తాజాగా నిర్వహించిన సర్వే ద్వారా ఏయే ప్రాంతాల్లో మరింత మెరుగుదల అవసరమో అధికారులకు స్పష్టత వచ్చినట్లు పేర్కొన్నారు.
తక్కువ సంతృప్తి శాతం నమోదైన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులకు రుచికరమైన, శుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు.
