
D Spiritual: Sept 29: తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి చెందిన సుమారు 200 ఏళ్ల చారిత్రక పుష్కరిణి పునరుద్ధరణకు సోమవారం శంకుస్థాపన జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల నిధులతో పుష్కరిణి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జేఈవో డా. ఎ. శరత్ తదితరులు కలిసి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నప్రసాదాల వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
పుష్కరిణి పునరుద్ధరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు. పనులు పూర్తయిన అనంతరం పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్మరించడం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని అన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆలయాలను సందర్శించి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5 వేల ఆలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు శ్రీకారం చుట్టిందని జేఈవో తెలిపారు. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
