
D NEWS: తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జర్మనీ పర్యటనలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌తో కలిసి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
తెలంగాణలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలను సమావేశంలో వివరించారు. జర్మనీతో పాటు యూరప్‌లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలోని అవకాశాలను పరిశీలించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు వారు ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు. ప్రవాస తెలంగాణ వాసులు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను తీసుకురావడంలో వారధిగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సెక్రెటరీ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రెటరీ ఆర్. తిరుపతి, లేజిస్లేచర్ ప్రతినిధి బృందం సభ్యులు, భారత కాన్సులేట్ అధికారులు, తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసుల సహకారం మరింత పెరగాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
