
D Spiritual: Sept 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తరహాలో ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా, కాంతివంతంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని జేఈవో సూచించారు. తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి, అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా జేఈవో పరిశీలించారు. అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేఈవో సూచించారు.
అనంతరం అధికారులతో కలిసి ఆలయ ఉద్యానవనం, ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, గేట్ నంబర్లు 1, 2, 3 ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
