
D Spiritual: Sept 29: వేద విద్యలో అరుదైన ఘనతను సాధిస్తూ బాసరకు చెందిన అంబరీష్ కుమారుడు అధర్వ బాసర్కర్ చిన్న వయసులోనే ఋగ్వేద ఘనాంతాన్ని పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నాడు. వ్యాసపుర చరిత్రలో ఇంత చిన్న వయసులో ఋగ్వేద ఘనాంతాన్ని పూర్తి చేయడం విశేషమని దేవస్థాన వర్గాలు పేర్కొన్నాయి.
అధర్వ బాసర్కర్ పట్టుదల, ఏకాగ్రతతో పాటు వేదాధ్యయనంపై ఉన్న ఆసక్తి ఈ ఘనత సాధించేందుకు దోహదపడిందని దేవస్థాన వర్గాలు తెలిపారు. చిన్న వయసులోనే వేదాలను అభ్యసించి ఘనాంతాన్ని పూర్తి చేయడం కుటుంబ సభ్యులతో పాటు బాసర వాసుల్లో ఆనందాన్ని నింపింది.
ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు సంజీవ్ మహారాజ్ అధర్వ బాసర్కర్ను అభినందించి ఆశీర్వదించారు. వేద విద్యలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంబరీష్ కుటుంబంపై ముగ్గురమ్మల సంపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, బాలుడికి ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మురళి శర్మ, హరీష్ బాసర్కర్, శివ వేదపండిత్ పాల్గొని అధర్వ బాసర్కర్ను అభినందించారు. బాసర ఆధ్యాత్మిక, వేద విద్యా సంప్రదాయానికి అధర్వ సాధించిన ఈ ఘనత మరింత వన్నె తెచ్చిందని పలువురు పేర్కొన్నారు.
