
D NEWS: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సోమవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీస్ (Incitement to Disaffection) Act, 1922లోని సెక్షన్ 3 కింద నమోదైన కేసులో ఆయనను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రిశాంక్ పలు ఆరోపణలు చేశారు.
ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని క్రిశాంక్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు పాతకాలం నాటి చట్టాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర్‌కు సంబంధించిన పాటలు ప్లే చేస్తున్న తెలంగాణ యువతపై కూడా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానని క్రిశాంక్ తెలిపారు. అయితే కేసులు, అరెస్టులు, కుటుంబ సభ్యులను బెదిరించడం, ఇంటి వద్ద పోలీసుల చర్యలతో ప్రతిపక్ష గొంతులను అణచలేరని అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులపై గతంలో జరిగిన ఈడీ సోదాల అంశాన్ని కూడా క్రిశాంక్ ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆ సోదాలకు సంబంధించిన వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధం ఉందని తాను ఆరోపిస్తున్న షెల్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై కూడా క్రిశాంక్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు ప్రభుత్వం ప్రజల ముందు సమాధానం ఇవ్వాలని కోరారు.
