Srikanth Odela Clarifies The Controversial Mother-Daughter Scene In The Paradise

D News : నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమాలో తల్లి–కూతుళ్ల మధ్య వచ్చే ఓ సన్నివేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా” అనే డైలాగ్‌పై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీన్ వెనుక అసలు కథ..

ఈ వివాదంపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాజాగా వివరణ ఇచ్చారు. చిన్నతనంలో హీరోయిన్ కావాలనే ఆశతో ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురిని తల్లి కొట్టి, “నీకు యాక్టింగే రాదు.. నిన్నెవడు సినిమాల్లోకి తీసుకుంటాడు?” అంటూ అవమానిస్తుందని ఆయన తెలిపారు. చివరికి తల్లి చెప్పినట్టుగానే ఆమె ఓడిపోయి తిరిగి వస్తుందని చూపించాల్సి ఉందన్నారు.

అయితే తర్వాత పరిస్థితులు మారడంతో తల్లి ముందే కూతురు అద్భుతంగా నటించే సందర్భం వస్తుందని, అప్పుడు ఆమె ప్రతిభను గుర్తించిన తల్లి గతంలో చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఆమెను గొప్ప ఆర్టిస్ట్‌గా అంగీకరిస్తుందని శ్రీకాంత్ వివరించారు.

ఎక్కడ మిస్సయ్యిందంటే..

ఈ సన్నివేశానికి సంబంధించిన ఎమోషనల్ పే-ఆఫ్ బాగానే ఉన్నప్పటికీ, దానికి అవసరమైన బ్యాక్‌స్టోరీ ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాలేదని శ్రీకాంత్ అంగీకరించారు. సినిమా లెంగ్త్ కారణంగా ఎడిటింగ్ సమయంలో కూతురి చిన్ననాటి నేపథ్యాన్ని చూపించే సీన్‌ను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.

దీంతో అసలు ఉద్దేశం తెలియని ప్రేక్షకులకు తల్లి కూతురిని స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా అనిపించిందని, ఆ సెటప్ మిస్సవడం వల్లే ఈ సీన్‌పై విమర్శలు వచ్చాయని శ్రీకాంత్, నాని వివరించారు.

By Avinash