సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

భూ వ్యవహారాలపై ముఖ్యమంత్రికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎనిమిది వేల ఎకరాల భూమికి సంబంధించి 2,400 ఎకరాలను రికవరీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

అలాగే బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకు చెల్లించాల్సిన రూ.60 కోట్ల పెండింగ్‌ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించాలని కోరారు.

రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా బకాయిలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్‌ అన్నారు. ఈ అంశాలపై సమాధానం ఇచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో పర్యటించాలని ఆయన పేర్కొన్నారు.

By Rajini