
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GO 455, 456, 747, 92 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు Memo No.48062 జారీ చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ULC సమస్యల పరిష్కారానికి సంబంధించి 2016లోనే ప్రభుత్వం GO జారీ చేసినప్పటికీ, గతంలో దాని అమలు జరగలేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన ULC కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-A భూ సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే GO 118, GO 76కు అనుగుణంగా కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. 22-A జాబితాలో ఉన్నప్పటికీ సంబంధిత అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పించినట్లు పేర్కొన్నారు.
తాజాగా ULC పెండింగ్ దరఖాస్తులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ద్వారా భూ సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు పడిందని మంత్రి అన్నారు. మిగిలిన 22-A సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
