
D NEWS: రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది.
2016లో ULC పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి పలు జీవోలు జారీ అయినప్పటికీ వాటి అమలులో జాప్యం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫలితంగా వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మెమో నెం.48062ను జారీ చేసినట్లు తెలిపారు.
జీవో నెం.455, 456, 747, 92 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హత ఉన్న ప్రతి కేసును నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన దరఖాస్తుదారులకు భూ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 22A భూ సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జీవో 118, జీవో 76కు అనుగుణంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 22A జాబితాలో ఉన్నప్పటికీ చట్టపరమైన అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులు తొలగించినట్లు పేర్కొంది.
మిగిలిన 22A భూ సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భూ సమస్యల పరిష్కారంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గించాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ULC, 22A అంశాల్లో పెండింగ్ కేసుల పరిష్కారం ద్వారా భూ రికార్డుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
