
D News : ఇండియన్ సినిమా నుంచి భారీ అంచనాలతో వస్తున్న ‘రామాయణం: పార్ట్ 1’కు అంతర్జాతీయంగా ఆసక్తికరమైన పోటీ ఎదురవుతోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జపాన్‌కు చెందిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ పోటీ పడుతోంది. రెండు సినిమాలు నవంబర్ 6, 2026న థియేటర్లలోకి రానుండటంతో గ్లోబల్ బాక్సాఫీస్‌పై ఆసక్తి పెరిగింది.
ఇక రెండు సినిమాలకూ మరో ప్రత్యేకత ఉంది. తమ తమ దేశాల నుంచి అధికారికంగా ‘Filmed for IMAX’ కార్యక్రమంలో భాగమైన తొలి చిత్రాలుగా ఇవి నిలుస్తున్నాయి. దీంతో భారీ విజువల్ స్కేల్‌తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై అంతర్జాతీయ ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
గాడ్జిల్లాకు అదిరిపోయే రెస్పాన్స్
తకాషి యమజాకి దర్శకత్వం వహించిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ఇప్పటికే వరల్డ్ ప్రీమియర్‌తో సందడి చేసింది. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. రాటెన్ టొమాటోస్‌లో 93 శాతం క్రిటిక్స్ స్కోర్‌తో ఈ మూవీ ప్రారంభమైంది.
గత చిత్రంలోని ఎమోషనల్ టచ్‌ను కొనసాగిస్తూనే ఈసారి కథను మరింత డార్క్, ఇంటెన్స్‌గా తెరకెక్కించినట్లు విమర్శకులు ప్రశంసిస్తున్నారు. గాడ్జిల్లాతో పాటు ఘిడోరా మధ్య పోరాటం కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
రామాయణంపై భారీ అంచనాలు
మరోవైపు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం: పార్ట్ 1’ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
ఒకవైపు భారతీయ ఇతిహాస కథను ఆధారంగా చేసుకున్న ‘రామాయణం’.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గాడ్జిల్లా ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ‘మైనస్ జీరో’. దీంతో నవంబర్‌లో ఈ రెండు భారీ చిత్రాలపై అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
