D Educt: Sept 26: గేట్‌ 2027 దరఖాస్తులకు సెప్టెంబర్‌ 27 వరకు అవకాశం

దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగాలకు అర్హత కల్పించే ‘గేట్‌ 2027’ పరీక్షకు దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 27తో ముగియనుంది. ఐఐటీ మద్రాస్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సుల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా గేట్‌ 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 5 వరకు అవకాశం

సాధారణ రుసుముతో సెప్టెంబర్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,000గా, ఇతర అభ్యర్థులకు రూ.2,000గా నిర్ణయించారు.

30 పేపర్లలో పరీక్ష

గేట్‌ 2027లో కొత్తగా ‘రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌’ విభాగాన్ని చేర్చారు. దీంతో మొత్తం 30 పేపర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో (CBT) 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఫిబ్రవరిలో పరీక్షలు

గేట్‌ 2027 పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి గేట్‌ స్కోర్‌ కార్డు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.