D Spiritual: Sept 26: వేములవాడ ఆలయంలో విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపు సేవలను అధికారులు విస్తరిస్తున్నారు. ప్రసాదాలు, ఆర్జిత సేవలు, విరాళాలు, ఇతర సేవలకు నగదు అవసరం లేకుండా చెల్లింపులు చేసేలా డిజిటల్ విధానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు భీమేశ్వరసదన్‌లో డిజిటల్ కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు.

క్రెడిట్, డెబిట్ కార్డులు.. ఫోన్‌పే, గూగుల్‌పేతో చెల్లింపులు

ప్రస్తుతం ఆలయంలోని బుకింగ్ కౌంటర్, ప్రొటోకాల్ కార్యాలయం, విరాళాల కౌంటర్లలో కియోస్క్ యంత్రాల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించారు. భక్తులు క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. త్వరలో మరిన్ని కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.

త్వరలో POS మిషన్ల సేవలు

డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించే చర్యల్లో భాగంగా ఆలయంలో పాయింట్ ఆఫ్ సేల్ (POS) మిషన్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే గత నెలలో ప్రొటోకాల్ కార్యాలయంలో సంబంధిత బ్యాంకు అధికారులు ఆలయ సిబ్బందికి POS మిషన్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే విధానం, మిషన్లను ఉపయోగించే తీరుపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

నగదు కోసం భక్తులకు ఇబ్బందులు లేకుండా..

వేములవాడ ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవలు, ప్రసాదాలు, కోడె మొక్కులు, వసతి గదులు తదితర సేవలకు భక్తులు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గతంలో చేతిలో నగదు లేకపోతే ఏటీఎంకు వెళ్లడం లేదా ఇతరుల నుంచి నగదు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు డిజిటల్ చెల్లింపుల సదుపాయాలను విస్తరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లోనూ పలు సేవల బుకింగ్

వేములవాడ ఆలయంలో ఇప్పటికే పలు సేవలను ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. కోడె మొక్కులు, రుద్రాభిషేకం, అన్నపూజ, కుంకుమపూజ, ఆకుల పూజ, శివకల్యాణం, మహాలింగార్చన, పెద్దసేవ, పల్లకి సేవ వంటి ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే తలనీలాలు, సత్యనారాయణ వ్రతాలు, బద్దిపోచమ్మ ఆలయంలో బోనం మొక్కులు, ఆలయ వసతి గదుల బుకింగ్ వంటి సేవలకు కూడా ఆన్‌లైన్ సదుపాయాలు ఉన్నాయి.

ఒక్కో సేవను దశలవారీగా డిజిటలైజేషన్

ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు ఆలయ కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడంతో భక్తులకు సమయం ఆదా కానుంది. నగదు నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గనున్నాయి. భక్తులకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించడమే లక్ష్యంగా డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఒక్కో సేవను దశలవారీగా డిజిటలైజ్ చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆమె వెల్లడించారు.