
D NEWS: భారత ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ప్రజల్లో ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో పారదర్శకతతో పాటు ఎన్నికల సంఘం నిర్ణయాలపై స్పష్టత అవసరమని అన్నారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. ముగ్గురు సభ్యుల కమిషన్లో నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ఆధారంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
SIR వంటి ప్రక్రియ కోట్లాది మంది ఓటర్లపై ప్రభావం చూపుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటో, వాటిపై కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందో ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణలో ఒక్క అర్హుడి ఓటు హక్కు కూడా అన్యాయంగా తొలగించకూడదని అన్నారు.
SIRలో ప్రతి దశకు స్పష్టమైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడంతో పాటు ప్రజలకు కూడా స్వతంత్ర సంస్థగా కనిపించాల్సిన అవసరం ఉందన్నారు.
2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పునఃపరిశీలించాలని వినోద్ కుమార్ కోరారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తిరిగి భాగస్వామిగా చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మాటల్లో కాకుండా శాసనపరమైన చర్యల ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
