
D Spiritual: Sept 26: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త అందించారు. ఉత్సవాల సమయంలో సామాన్య భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ తదితరులు ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు.
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివిధ సేవా టికెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
నూతన పూజా మండపంలో ప్రత్యేక పూజలు
ఈ ఏడాది దసరా మహోత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయంలోని నూతన పూజా మండపంలో భక్తుల కోసం పలు ప్రత్యేక ఆర్జిత సేవలను నిర్వహించనున్నారు. ప్రత్యేక ఖడ్గమాలార్చన, చండీయాగం, ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన వంటి పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు.
దూరప్రాంతాల్లో ఉండి ఆలయానికి నేరుగా వచ్చి ఈ సేవల్లో పాల్గొనలేని భక్తులకు కూడా పరోక్ష సేవల ద్వారా అవకాశం కల్పించారు. ఇంటి నుంచే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పరోక్షంగా పాల్గొనే సదుపాయం అందుబాటులో ఉంటుంది. పూజా సమయంలో అర్చకులు అమ్మవారి సన్నిధిలో భక్తుల పేర్లు, గోత్రాలను చదివి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
బుకింగ్ విధానం, రుసుముల వివరాలు
భక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారిక పోర్టల్ tms.ap.gov.in ద్వారా సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘మనమిత్ర’ అధికారిక వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.
ఒక రోజు ప్రత్యేక పూజా టికెట్ రుసుము రూ.1,500గా నిర్ణయించారు. పది రోజుల ప్యాకేజీకి రూ.11,116 చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టల్ ద్వారా ప్రసాదాలు.. పరోక్ష సేవలకు దర్శనానికి అనుమతి లేదు
దసరా ఉత్సవాలు పూర్తయిన తర్వాత పరోక్ష సేవలను బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా ప్రత్యేక ప్రసాదాలను పంపించనున్నారు. ఇందులో అమ్మవారి శేషవస్త్రం, రవిక ముక్క, శ్రీచక్ర పీఠం, కుంకుమ భరిణె, రక్షా కంకణాలు, ల్యామినేషన్ చేసిన అమ్మవారి ఫొటోలు ఉంటాయి.
అయితే పరోక్ష సేవా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆలయంలో నేరుగా పూజల్లో పాల్గొనేందుకు లేదా అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుంచి విజయవాడకు రాలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
భక్తులు దేవాదాయ శాఖ పోర్టల్, వాట్సాప్ సేవలతో పాటు ప్రధాన ఆలయాల ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా దర్శనం, వివిధ సేవలు, వసతి గదులను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
