
D Spiritual: Sept 26: భద్రాచలం వద్ద గణేష్ నిమజ్జనంలో అనూహ్య ప్రమాదం
భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జన వేడుకల్లో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. భారీ గణేష్ విగ్రహాన్ని నదిలోకి తరలిస్తున్న సమయంలో క్రేన్‌కు సంబంధించిన కేబుల్ తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో సింగరేణికి చెందిన భారీ క్రేన్ అదుపుతప్పి ఒరిగిపోయి బోల్తా పడింది.
క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న గణపతి విగ్రహం ఒక్కసారిగా కిందపడటంతో తీవ్రంగా దెబ్బతిని విరిగిపోయింది. ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న నిమజ్జన వేడుకల్లో ఈ ఘటనతో భక్తులు, నిర్వాహకులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం జరుగుతున్న సమయంలో క్రేన్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. క్రేన్ బోల్తా పడుతున్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆయన కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కేబుల్స్ తెగిపోవడంతో విగ్రహం విరిగిపోవడంతో పాటు క్రేన్ బోల్తా పడినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనతో గోదావరి ఘాట్ వద్ద కొద్దిసేపు నిమజ్జన కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన క్రేన్‌ను తొలగించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాలను తిరిగి కొనసాగించారు.
