
D Spiritual: Sept 25: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం తరలిస్తున్న ఊరేగింపు వాహనం కిందపడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పండుగ వాతావరణంలో కోలాహలంగా సాగుతున్న శోభాయాత్రలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
లాఠీఛార్జ్ సమయంలో ప్రమాదం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. శోభాయాత్ర సమయంలో డ్యాన్స్ చేస్తున్న యువకుల సమూహాన్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లాఠీఛార్జ్ జరగడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో యువకుడు పక్కనే ఉన్న ట్యాంకర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ట్యాంకర్‌పైకి ఎక్కే ప్రయత్నంలో యువకుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఊరేగింపు ట్రక్ చక్రాల కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
పోలీసుల తీరుపై ఆగ్రహం
యువకుడి అకాల మరణంతో అతని స్నేహితులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘటనకు పోలీసుల చర్యలే కారణమంటూ ఆరోపిస్తూ ఖైరతాబాద్ పరిసర ప్రాంతంలో కొందరు నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
