
D Educt: Sept 24: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 అధ్యాపకుల పోస్టుల భర్తీకి కసరత్తు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 సహాయ ఆచార్యులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జీఓకు అనుగుణంగా నియామక విధానంలో కొన్ని మార్పులు చేయనున్నారు.
ఇటీవల టీజీపీఎస్సీలో నిర్వహించిన సమావేశంలో పోస్టుల భర్తీకి సంబంధించి రెండు, మూడు అంశాల్లో స్వల్ప మార్పులు సూచించినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను టీజీపీఎస్సీకి పంపించినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2013లో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులను భర్తీ చేశారు. అనంతరం 491 అధ్యాపకులు, 24 లైబ్రేరియన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను కలిపి మొత్తం 544 ఖాళీల భర్తీకి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే యూజీసీ మార్గదర్శకాలను పాటించలేదనే అభ్యంతరాలతో పాటు ఫిజికల్ డైరెక్టర్ల విద్యార్హతలకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు రావడంతో ఆ నియామక ప్రక్రియ నిలిచిపోయింది.
పాత నోటిఫికేషన్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రభుత్వం జీఓ-4ను జారీ చేసింది. దీని ప్రకారం అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించనున్నారు.
మరో వెయ్యి పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
రాష్ట్రంలో మూడేళ్ల క్రితం 132గా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య ప్రస్తుతం 150కి చేరింది. వీటిలో అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు కలిపి మొత్తం 4,098 మంజూరు పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 1,500 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 2 వేల మంది అతిథి అధ్యాపకులు, దాదాపు 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.
కళాశాలల్లో అవసరాలకు అనుగుణంగా కనీసం మరో 2 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం 544 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఉన్నందున వాటికే ముందుగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు అదనంగా వెయ్యి ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే, తదుపరి దశలో మరో నోటిఫికేషన్ ద్వారా ఆ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
