
D News : టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై మరింత హైప్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో సందడి చేయబోతోంది.
ముఖ్య అతిథిగా మెగాస్టార్
‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి సినిమా వేడుకకు చిరంజీవి రావడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రైమ్, గ్యాంబ్లింగ్, మాస్ యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందించినట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. సుమారు రూ.500 కోట్ల నేపథ్యంతో సాగే కథగా ‘సిగ్మా’ను తెరకెక్కించినట్లు సమాచారం.
సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయనుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
దర్శకుడిగా జేసన్ సంజయ్ తొలి అడుగులు, సందీప్ కిషన్ యాక్షన్ అవతార్, ఫరియా అబ్దుల్లా పాత్ర, థమన్ సంగీతం.. ఇలా పలు అంశాలతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ప్రీ-రిలీజ్ వేడుకలో చిరంజీవి ఏం మాట్లాడబోతున్నారనే దానిపైనా ఆసక్తి నెలకొంది.
