
D Educt: Sept 24: దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSU) ఉద్యోగాలకు అర్హత కల్పించే ‘గేట్ 2027’ పరీక్షకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27తో ముగియనుంది. ఐఐటీ మద్రాస్ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా గేట్ 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,000గా, ఇతర అభ్యర్థులకు రూ.2,000గా నిర్ణయించారు.
గేట్ 2027లో కొత్తగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఈసారి మొత్తం 30 పేపర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
గేట్ 2027 పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు.
గేట్ స్కోర్‌కార్డు ఫలితాలు వెలువడిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా ఐఐటీలతో పాటు ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నియామకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది.
