
D News : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు మైత్రీ థియేటర్స్ ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సర్వపిండిని ‘ది ప్యారడైజ్’ ప్రదర్శించే కొన్ని థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు అందించనున్నారు. సినిమా చూడటంతో పాటు తెలంగాణ స్థానిక రుచిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటును చేస్తున్నట్లు తెలుస్తోంది.
77 ఏళ్ల బామ్మ చేతుల మీదుగా సర్వపిండి
మైత్రీ థియేటర్స్ వెల్లడించిన పోస్టర్ ప్రకారం మైత్రీ విమల్, మైత్రీ శివ గంగా థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని అందించనున్నారు. ప్రత్యేకత ఏంటంటే.. ఈ సర్వపిండిని ఓ 77 ఏళ్ల బామ్మ స్వయంగా తయారు చేయనున్నారు.
సాధారణ ఇంటర్వెల్ స్నాక్స్‌కు భిన్నంగా తెలంగాణకు చెందిన సంప్రదాయ వంటకాన్ని ప్రేక్షకులకు అందించడంతో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా అనుభవంలో తెలంగాణ సంస్కృతి, ఆహారపు రుచిని కూడా భాగం చేయాలనే ఈ ప్రయత్నం సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
