D NEWS: దళితులు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టంపై జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎస్సీలకు 31 శాతం, ఎస్టీలకు 17 శాతం ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో దళితులు, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. విద్యతోనే అట్టడుగు వర్గాల జీవితాల్లో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచార ఘటనల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని ఆలస్యం చేయకుండా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేగంగా విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

ఇక దళితులు, గిరిజనుల పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సీఎం పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ వర్గాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం వారి సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.