
D News: విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ ఆయన పాత్రపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ కాలేజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ప్యారడైజ్’ పేరు వినగానే విద్యార్థుల కేరింతలు
కాలేజ్ ఈవెంట్‌లో విద్యార్థులతో ముచ్చటించిన మోహన్ బాబు.. తన ప్రసంగంలో ‘ప్యారడైజ్’ అనే పదాన్ని ప్రస్తావించారు. వెంటనే విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు, చప్పట్లతో స్పందించారు. దీంతో వారు ‘ది ప్యారడైజ్’ సినిమాను ఉద్దేశించే ఈ రియాక్షన్ ఇచ్చారని మోహన్ బాబు గుర్తించారు.
ఆ వెంటనే తన పాత్ర గురించి ఆసక్తికరంగా స్పందించారు. “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.. అంత భయంకరమైన క్యారెక్టర్ అది” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు విన్న విద్యార్థులు మరింత ఉత్సాహంగా స్పందించారు.
మోహన్ బాబు పాత్రపై పెరిగిన ఆసక్తి
మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలతో ‘ది ప్యారడైజ్’లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే పాత్ర స్వభావం, కథలో దాని ప్రాధాన్యత వంటి విషయాలను చిత్రబృందం పూర్తిగా వెల్లడించలేదు.
మరోవైపు మోహన్ బాబు తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన, పవర్‌ఫుల్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో ఆయనను ఎలా చూపించారనేది ఆసక్తికరంగా మారింది.
నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా కనిపించనున్నారు. రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
