
D News: Sept 22: మంచి జీతం, ఉన్నత స్థాయి కెరీర్ చాలామందికి లక్ష్యంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి కారణాలతో కొందరు తమ కెరీర్ దిశను మార్చుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 30 ఏళ్ల లిజ్ ఈస్ట్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. క్రిమినల్ డిఫెన్స్ రంగంలో లాయర్‌గా పనిచేసిన ఆమె.. ఆ వృత్తికి గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్ డాగ్ వాకర్‌గా మారారు. ప్రస్తుతం గతంలో కంటే తక్కువ గంటలు పనిచేస్తూనే ఎక్కువ ఆదాయం పొందుతున్నానని ఆమె చెబుతున్నారు.
లిజ్ ఈస్ట్ దాదాపు నాలుగేళ్ల పాటు క్రిమినల్ డిఫెన్స్ రంగంలో పనిచేశారు. పారాలీగల్‌గా ఉన్న సమయంలో అడ్మినిస్ట్రేటివ్ పనులతో పాటు కోర్టులకు వెళ్లడం, జైళ్లను సందర్శించడం, క్లయింట్లతో మాట్లాడటం వంటి బాధ్యతలు నిర్వహించారు. అయితే కాలక్రమేణా ఈ ఉద్యోగం ఆమెపై మానసికంగా, వ్యక్తిగతంగా ప్రభావం చూపింది. నిరంతర పని ఒత్తిడితో తన వయసు కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించేదని ఆమె తెలిపారు. ‘ఇదేనా నా జీవితం?’ అనే ఆలోచన తరచూ తనను వెంటాడేదని పేర్కొన్నారు.
లండన్ జీవనశైలితోనూ ఒత్తిడి
ఉద్యోగంతో పాటు లండన్‌లోని సామాజిక జీవనశైలి కూడా తనపై ఒత్తిడిని పెంచిందని ఈస్ట్ తెలిపారు. పని పూర్తయిన తర్వాత స్నేహితులతో బయటకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పారు. భవిష్యత్తులో కుటుంబంతో గడపడానికి ఇలాంటి జీవనశైలి అనుకూలంగా ఉండదని భావించినట్లు తెలిపారు.
మంచి ఆదాయం ఉన్నప్పటికీ తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో కొనసాగడం తనకు సరైన నిర్ణయం కాదని ఈస్ట్ భావించారు. ఆమె భర్త ఇప్పటికే డాగ్ వాకింగ్, డాగ్ బోర్డింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఎంతో ఇష్టంగా ఆ పని చేయడం చూసిన తర్వాత తాను మాత్రం ప్రతి వారాంతం పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నాననే ఆలోచన తనలో మొదలైందని చెప్పారు. దీంతో న్యాయరంగాన్ని వదిలి పెంపుడు జంతువుల సంరక్షణ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కొత్త వ్యాపారం ప్రారంభించిన వెంటనే ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో తన ఖర్చుల కోసం స్థానిక పబ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. అదే సమయంలో డాగ్ వాకింగ్ సేవలకు కస్టమర్లను సంపాదించడం ప్రారంభించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆమెకు రెగ్యులర్ క్లయింట్లు పెరిగారు. ప్రస్తుతం రోజుకు నాలుగు గ్రూప్ వాక్స్ నిర్వహిస్తూ 20 నుంచి 30 కుక్కలను చూసుకుంటున్నట్లు తెలిపారు.
ఒక్క కుక్కకు గంటకు సుమారు 14 పౌండ్లు వసూలు చేస్తున్నట్లు ఈస్ట్ వెల్లడించారు. రోజుకు సుమారు రూ.38,500 నుంచి రూ.51,400 వరకు టర్నోవర్ వస్తుందని చెప్పారు. లాయర్ వృత్తిని వదిలి డాగ్ వాకర్‌గా మారడంపై కొందరు విమర్శలు చేసినట్లు తెలిపారు. తాను ఆరు సంవత్సరాలు చదివి సంపాదించిన విద్యను వృథా చేసుకున్నానని కొందరు భావించారని చెప్పారు. అయితే ఆ సమయంలో నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ తన రోజువారీ జీవితంలో ఉపయోగపడుతున్నాయని ఈస్ట్ పేర్కొన్నారు.
ఇప్పుడు ఎక్కువ ఆదాయం.. తక్కువ పని గంటలు
డాగ్ వాకర్‌గా మారిన తర్వాత తన ఆదాయం పెరిగిందని ఈస్ట్ తెలిపారు. గత కార్పొరేట్ ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు నెలకు వేల పౌండ్లు ఎక్కువగా సంపాదిస్తున్నానని, అదే సమయంలో గతంలో పనిచేసిన సమయంతో పోలిస్తే దాదాపు సగం గంటలే పని చేస్తున్నానని చెప్పారు. అయితే కేవలం డబ్బు కోసం ఈ వృత్తిని ఎంచుకోవద్దని ఆమె సూచించారు.
జంతువులంటే నిజమైన ప్రేమ ఉండటంతో పాటు బయట పనిచేయడం, కుక్కలతో సమయం గడపడం ఇష్టపడేవారికే డాగ్ వాకింగ్ వృత్తి సరిపోతుందని ఈస్ట్ తెలిపారు. ప్రస్తుతం ఉదయం లేచి పనికి వెళ్లడాన్ని ఎంతో ఇష్టపడుతున్నానని చెప్పారు.
తన లా డిగ్రీ ఎప్పటికీ తన వద్దే ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో తిరిగి న్యాయరంగంలోకి వెళ్లే అవకాశం ఉందని ఈస్ట్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న పనిని ఎంతో ఆస్వాదిస్తున్నందున తిరిగి లా ప్రొఫెషన్‌లోకి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు.
