
D News: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
సామాన్య యువకుడి నుంచి మెగాస్టార్‌గా..
కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నటనతో పాటు డ్యాన్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోల డ్యాన్స్, యాక్షన్‌కు కొత్త శైలిని పరిచయం చేసిన నటుడిగా గుర్తింపు పొందారు.
కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న చిరంజీవి అగ్ర కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను అందుకున్నారు. డ్యాన్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు.
‘చిరంజీవి’ అనే పేరు.. మీ ప్రేమతో శాశ్వత గుర్తింపు
48 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి తన సోషల్ మీడియా పోస్టులో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే తన కెరీర్‌లో అందుకున్న విజయాలు, అవార్డులు, గౌరవాల కంటే అభిమానులు తనపై చూపించిన ప్రేమే అత్యంత విలువైనదని చిరంజీవి పేర్కొన్నారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రతి అభిమానికీ కృతజ్ఞతలు తెలిపారు.
1978లో తాను పెట్టుకున్న ‘చిరంజీవి’ అనే పేరు.. ఈ 48 ఏళ్ల ప్రయాణంలో అభిమానుల ప్రేమతో తనకు శాశ్వతమైన గుర్తింపుగా మారిందని చిరంజీవి భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆయన సందేశం ప్రస్తుతం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
