
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె జరిగే అవకాశం ఉంది. సమ్మె అమలైతే బ్యాంకు శాఖల ఆధారిత సేవలకు అంతరాయం కలగవచ్చని బ్యాంకులు వినియోగదారులను హెచ్చరించాయి.
సెప్టెంబర్ 26న నెలలో రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా శాఖలు మూసి ఉంటాయి. దీంతో మూడు రోజుల సమ్మెకు తోడుగా ఈ రెండు సెలవు రోజులు కలిస్తే సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయడం సహా పలు డిమాండ్లను బ్యాంకు ఉద్యోగ సంఘాలు ముందుకు తెస్తున్నాయి. అప్‌డేట్ చేసిన మెరుగైన పెన్షన్లు పెన్షనర్లందరికీ ఒకే విధమైన కరువు భత్యం (DA) ఫార్ములా జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)లో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS)లోకి మారే అవకాశం కల్పించడం వంటి డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. UFBU తమకు బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల్లో సుమారు 90 శాతం మంది ప్రాతినిధ్యం ఉందని చెబుతోంది.
ఇదే డిమాండ్లపై UFBUకు అనుబంధంగా ఉన్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు గతంలో సెప్టెంబర్ 11న కూడా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
