
D Spiritual: Sept 18: గణేష్ నిమజ్జనాలు, పండుగలు, వివాహ వేడుకల్లో వినియోగిస్తున్న డీజే శబ్దాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సరదాగా డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపుల్లో పాల్గొంటున్న కొందరు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నిమ్స్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సాయి సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం, అధిక శబ్దాలు చెవుల వినికిడి శక్తిని దెబ్బతీయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన కార్డియాక్ అరెస్టుకు దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా మనుషులు 60 నుంచి 70 డెసిబెల్స్ (dB) వరకు శబ్దాన్ని సురక్షితంగా వినగలరు. అయితే ఈవెంట్లలో వినియోగించే డీజే సిస్టమ్స్ 100 నుంచి 120 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.
డీజే స్పీకర్లకు సమీపంలో ఎక్కువసేపు నిలబడటం వల్ల అధిక శబ్ద తరంగాల ఒత్తిడి నేరుగా కర్ణభేరిపై పడుతుంది. దీంతో చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడటంతో పాటు, కొన్ని సందర్భాల్లో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
గుండె ఆరోగ్యంపై డీజే తీవ్ర ప్రభావం
అధిక శబ్దాల కారణంగా శరీరంలో ‘అడ్రినలిన్’ (Adrenaline) అనే హార్మోన్ ఒక్కసారిగా విడుదలై గుండె వేగం, రక్తపోటు పెరగవచ్చు. ఇప్పటికే గుండె నాళాల్లో అడ్డంకులు ఉన్నవారు, పేస్మేకర్ అమర్చుకున్నవారు, అలాగే అరుదైన ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ (Long QT Syndrome) సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
రక్తపోటు తీవ్రంగా పెరిగినప్పుడు గుండె కింది గదులు రక్తాన్ని సక్రమంగా పంప్ చేయలేకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో దీనివల్ల కార్డియాక్ అరెస్టు సంభవించే ప్రమాదం ఉంటుంది.
గతేడాది బతుకమ్మ వేడుకల్లో డీజే శబ్దాల మధ్య డ్యాన్స్ చేస్తూ ముగ్గురు మహిళలు హఠాత్తుగా కుప్పకూలి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే స్నేహితుడి వివాహ వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు హఠాత్తుగా కిందపడి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా చోటుచేసుకుంది.
