Bigg Boss 10 Telugu: Nagarjuna Warns Shalini, Varshini Loses Captaincy Duties Until Season Ends

D News: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం శనివారం ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌ ఆట తీరుపై హోస్ట్ అక్కినేని నాగార్జున గట్టిగానే స్పందించారు. టాస్కుల్లో దూకుడు, సంచాలకుల నిర్ణయాలు, ఇంట్లో కంటెస్టెంట్ల ప్రవర్తనపై ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా షాలినీ, వర్షిణి, రోహిత్, వంశీలకు పలు సూచనలు చేశారు.

షాలినీకి నాగ్ వార్నింగ్

టాస్క్ సమయంలో వర్షిణితో షాలినీ వ్యవహరించిన తీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎదుటివారిపైకి దూసుకెళ్లడం, అనవసరంగా కోపాన్ని ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని సూచించారు.

వర్షిణి కేవలం టచ్ చేసిన సందర్భాన్ని పెద్దదిగా తీసుకోవద్దని, కోపాన్ని నియంత్రించుకోవాలని షాలినీకి చెప్పారు. తాను ఇతరులకు ఏ హక్కులు ఇస్తుందో, అదే హక్కులు ఇతరులకు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. నాగ్ క్లాస్‌తో షాలినీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

వర్షిణికి సంచాలక్ పవర్ కట్

ఈ వారం టాస్కుల్లో సంచాలకురాలిగా వ్యవహరించిన వర్షిణి నిర్ణయాలపైనా నాగార్జున ప్రశ్నలు సంధించారు. ముఖేష్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, వంశీ చెప్పిన పాయింట్లను పట్టించుకోలేదని ఆమెకు చెప్పారు.

ఇదే సమయంలో సంచాలకురాలిగా ఆమె తీసుకున్న నిర్ణయంపై బిగ్ బాస్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా సీజన్ పూర్తయ్యే వరకు వర్షిణిని సంచాలకురాలిగా నియమించబోమని బిగ్ బాస్ శిక్ష విధించారు.

రోహిత్, వంశీలకు కూడా క్లాస్

ఫిజికల్ టాస్కుల్లో అత్యుత్సాహం చూపిస్తున్న రోహిత్‌కు కూడా నాగార్జున సూచనలు చేశారు. ఆటలో దూకుడు ఉండటం మంచిదే కానీ కోపంతో హద్దులు దాటకూడదని చెప్పారు.

కిచెన్‌లో వంట చేసే సమయంలో అరుస్తూ ఉండటంపై వంశీని కూడా నాగ్ హెచ్చరించారు. ఇంట్లో పగటిపూట కంటెస్టెంట్లు నిద్రపోతుండటంతో ఇకపై పగటి సమయంలో బెడ్‌రూమ్‌లోకి వెళ్లకూడదని కొత్త రూల్‌ను కూడా ప్రకటించారు.

ఐదుగురు సేఫ్

ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ముఖేష్, షాలినీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ ముగిసింది.

By Avinash