
D News: దర్శకుడు అట్లీ తన కెరీర్లో నటుడు విజయ్ అందించిన ప్రోత్సాహాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘రాజా రాణి’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. ఆ తర్వాత విజయ్‌తో ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సినిమాలు చేశారు. అనంతరం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ తెరకెక్కించి బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించారు.
తాజాగా ‘బత్తా’ ఆడియో లాంచ్‌లో పాల్గొన్న అట్లీ.. తన కెరీర్ ఎదుగుదలలో విజయ్ పాత్ర గురించి మాట్లాడారు. తన కష్టానికి తాను క్రెడిట్ ఇచ్చుకున్నప్పటికీ.. విజయ్ వరుసగా మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వడం తన ప్రయాణాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు. విజయ్ తనకు ఇచ్చిన అవకాశాలు లేకపోతే ఈ స్థాయికి రావడం సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు.
‘జవాన్’ విషయంలోనూ విజయ్ సలహా
షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా విజయ్ తనను ప్రోత్సహించారని అట్లీ వెల్లడించారు. షారుఖ్ తన ఆఫీస్‌కు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని విజయ్‌తో చర్చించానని.. ఆ ప్రాజెక్ట్ తప్పకుండా చేయాలని విజయ్ సూచించారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ‘జవాన్’ తన కెరీర్లో మరో కీలక మలుపుగా మారిందని అట్లీ తెలిపారు.
తాను ప్రతి సందర్భంలో విజయ్ పేరును ప్రస్తావించడం వెనుక మరో సినిమా అవకాశం పొందాలనే ఉద్దేశం లేదని అట్లీ స్పష్టం చేశారు. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో కలిసి సినిమా చేసే అవకాశం లేకపోవచ్చని.. అయినప్పటికీ విజయ్ తనకు ఎప్పటికీ అన్నలాంటివారేనని చెప్పారు.
ఇక ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రాకా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
