CBFC New Guidelines: Film Industry Raises Concerns Over Stricter Certification Rules

D News: సినిమాల సర్టిఫికేషన్‌కు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. దాదాపు 1991 తర్వాత మారిన ఈ నిబంధనల్లో హింస, డ్రగ్స్‌, మహిళల చిత్రణ, లైంగిక దాడి సన్నివేశాలు, దేశ సార్వభౌమత్వం, విదేశీ సంబంధాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. హింస, నేరాలు, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సినిమాల్లో చూపించకూడదు. లైంగిక దాడి సన్నివేశాలను గ్రాఫిక్‌గా ప్రదర్శించరాదు. మహిళలను కించపరిచే లేదా చిన్నారులపై హింసను చూపించే సన్నివేశాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే కోర్టుల గౌరవానికి భంగం కలిగించే, విదేశీ సంబంధాలను ప్రభావితం చేసే లేదా దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే కంటెంట్‌పైనా నిబంధనలు వర్తించనున్నాయి.

అయితే ఈ మార్గదర్శకాలు సృజనాత్మక స్వేచ్ఛను పరిమితం చేసే ప్రమాదం ఉందని పలువురు సినీ ప్రియులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక, రాజకీయ అంశాలను ప్రశ్నించే సినిమాల నిర్మాణానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, సినిమా మొత్తాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని CBFCకి సూచించినట్లు అధికారిక మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే కొత్త నిబంధనల అమలు విధానం, సెన్సార్‌ నిర్ణయాలపై భవిష్యత్తులో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.

By Avinash