
సూర్యాపేట నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు దివంగత ఉప్పల మల్సూర్ కుటుంబం సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లింది.
కథనాన్ని చూసిన వెంటనే సీఎం స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉప్పల మల్సూర్ కోడళ్లు ఉప్పల పుష్పలత, ఉప్పల యశోద పేర్లపై రెండు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రతులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్వయంగా ఉప్పల మల్సూర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబం నిలువనీడ కోసం ఎదురుచూస్తున్న విషయం తనను కలచివేసిందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీఎం పేదలకు ఇళ్లు నిర్మించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
