D News: Sept 18: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) అభ్యర్థులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ పోస్టులకు డిసెంబర్‌ 20న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సెప్టెంబర్‌ 17న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

హోంశాఖ పరిధిలోని పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఛైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసు ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో ఎస్‌ఐ పోస్టులకు 1,60,756 మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష తేదీలు ఖరారు కావడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది.