
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్ ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఎలాంటి గాయాలు లేకుండా బయటపడగా ఆయన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో చింతపల్లి వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
పవర్ బ్యాంక్ పేలడంతో కారు కేబిన్‌లో మంటలు వ్యాపించినట్లు సమాచారం. అప్రమత్తమైన ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
అనంతరం రాంచంద్ర నాయక్ మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
