Renu Desai Makes Her OTT Debut.. Actress Returns as a Lead in ‘Kashi Majili’!

D News: చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మరోసారి హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్లలో కాదు.. నేరుగా ఓటీటీలో. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ లఘు చిత్రం తాజాగా ETV Winలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘కథా సుధా’ సిరీస్‌లో భాగంగా రూపొందిన ఈ ఎపిసోడ్‌కు యమునా కిషోర్ దర్శకత్వం వహించారు.

‘బద్రి’, ‘జానీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్.. ఆ తర్వాత నటనకు దూరంగా ఉండి, ‘టైగర్ నాగేశ్వరరావు’తో తిరిగి తెరపై కనిపించారు. ఇప్పుడు ‘కాశీ మజిలీ’తో మరోసారి కీలక పాత్రలో నటించారు. విశేషమేమిటంటే.. నటించడంతో పాటు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా ఆమెనే అందించారు.

ఇక ‘కాశీ మజిలీ’ కథ విషయానికి వస్తే.. కాశీకి వెళ్లిన ఓ మహిళ తన లగేజీ పోగొట్టుకోవడంతో పోలీసులను ఆశ్రయిస్తుంది. అదే సమయంలో మరో యువకుడి లగేజీ కూడా పోతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడే పరిచయం, వారి గతం, భావోద్వేగ ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. ప్రేమకు మరో అవకాశం దొరికితే జీవితాలు ఎలా మారుతాయనే అంశాన్ని ఈ కథలో చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్‌కు జోడీగా శంకర్ ఇందుచూడన్ నటించారు. జేకే ఆర్ట్స్ బ్యానర్‌పై జగదీష్ కుమార్ కాళ్లూరు నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు డాక్టర్ జోశ్యభట్ల సంగీతం అందించారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను కూడా ఇందులో ఉపయోగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ నటనతో పాటు రచయిత్రిగా కూడా కనిపించడం ‘కాశీ మజిలీ’కి ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ లఘు చిత్రం ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ETV Winలో స్ట్రీమింగ్ అవుతుండటంతో రేణు దేశాయ్‌ను మరోసారి హీరోయిన్‌గా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిగా మారింది.

By Avinash