
D Educt: Sept 11: వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు రాష్ట్రంలో ఆదరణ క్రమంగా తగ్గుతోంది. 2018లో 11 ప్రభుత్వ, 11 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 790 సీట్లు ఉండగా, 2019 నుంచి ప్రతి ఏడాది వందకు పైగా సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇతర కళాశాలల్లో విలీనం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 8 ప్రభుత్వ కళాశాలల్లో 385, మూడు ప్రైవేటు కళాశాలల్లో 180 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, మొత్తం 565 సీట్లకు కేవలం 315 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో ఇంకా 250 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 88, ప్రైవేటు కళాశాలల్లో 162 సీట్లు భర్తీ కాలేదు. ప్రైవేటు కళాశాలల్లో ఒకదానిలో 60 సీట్లకు 18 మంది మాత్రమే చేరగా, మిగిలిన రెండు కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వ్యవసాయ డిప్లొమా అర్హతతో 2019లో వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఆ పోస్టులకు మళ్లీ నియామకాలు జరిగే అవకాశం లేకపోవడం, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, డిప్లొమా ఏఈవోలకు నేరుగా అగ్రి బీఎస్సీ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే ఇన్‌సర్వీస్ కోటా రద్దు కావడం, బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కళాశాలలు, సీట్ల సంఖ్య పెరగడం వంటి కారణాలతో విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి చూపడం లేదని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నాలుగు ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఆధునికీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
