
D Spiritual: Sept 11: గణేశుడి వాహనం ఎలుక ఎందుకు?
గణేశుడి పాదాల దగ్గర కనిపించే ఎలుక ఆయన వాహనం. దీనివెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథతో పాటు లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. పురాణాల ప్రకారం.. క్రౌంచుడు అనే గంధర్వుడు తన అహంకారం, దురుసుతనంతో మహర్షి పరాశరుని ఆశ్రమంలో ఇబ్బందులు కలిగించాడు. దీంతో గణేశుడు అతడిని తన పాశంతో బంధించాడు. తన తప్పును తెలుసుకుని క్రౌంచుడు క్షమాపణ కోరడంతో.. గణేశుడు అతడిని ఎలుక రూపంలోకి మార్చాడని కథనం.
ఆ తర్వాత ఆ ఎలుక గణేశుడి వాహనంగా మారి ఆయన సేవలో ఉండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఎంతటి శక్తివంతుడైనా అహంకారాన్ని వీడి దైవం ముందు వినయంగా ఉండాలనే సందేశాన్ని సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఎలుక వెనుక ఆధ్యాత్మిక అర్థం
ఎలుకను చంచలమైన మనస్సు, కోరికలు, అజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. మనసు ఎప్పుడూ ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు పరుగులు తీస్తుంటుంది. అలాంటి ఎలుకపై గణేశుడు స్వారీ చేయడం ద్వారా జ్ఞానం, వివేకంతో మనస్సును అదుపులో ఉంచుకోవాలనే ఆధ్యాత్మిక సందేశం అందుతుందని చెబుతారు.
గణేశుడి పక్కన ఎలుకను ఎందుకు ఉంచుతారు?
గణేశుడి వాహనానికి గౌరవం ఇవ్వడం ద్వారా పూజ సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో భక్తులు తమ కోరికలను ఎలుక చెవిలో చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మొత్తంగా గణేశుడి పాదాల దగ్గర కనిపించే చిన్న ఎలుక.. అహంకారంపై వినయం, అజ్ఞానంపై జ్ఞానం, చంచలమైన మనస్సుపై నియంత్రణకు ప్రతీకగా భావిస్తారు.
