
D Spiritual: Sept 11: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరుస సెలవులు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
సెప్టెంబర్ 13న వీఐపీ దర్శనాలు రద్దు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 13న శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ మంది సాధారణ భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 12న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు కేటాయించే సమయాన్ని సామాన్య భక్తులకు ఉపయోగపడేలా దర్శనాల కోసం కేటాయించనున్నట్లు వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు పలు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ఏర్పాట్లు
మరోవైపు తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హుండీ కానుకలను లెక్కించగా ఏకంగా రూ.6.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే హుండీ ఆదాయం రూ.6 కోట్లకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.
అజ్ఞాత భక్తులు హుండీలో భారీ మొత్తంలో కానుకలు సమర్పించడంతో ఈ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దర్శన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది.
