
D Spiritual: Sept 10: టీటీడీ బ్రహ్మోత్సవాలు: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.
అంకురార్పణ, ధ్వజారోహణం వేడుకలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాత్రి 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుంది. 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుమలలో బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి, దర్శనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉత్సవాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి విభాగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.
భద్రత, అన్నప్రసాదం, ట్రాఫిక్‌పై నిఘా
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. అన్నప్రసాద కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ అదనపు బలగాలను మోహరించనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా వర్గాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి.
లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా వసతి, భద్రత, క్యూ లైన్లు, అన్నప్రసాదం, ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
