
D News: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుతో తాము కన్నీళ్లు పెట్టుకున్నామని ఆరోపిస్తూ, తమపై జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నాం
పోలీసుల వ్యవహారశైలితో తాము తీవ్రంగా బాధపడ్డామని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు. తమకే దెబ్బలు తగిలాయని, తమ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను పోలీసులు లాగారని ఆరోపణ
పోలీసులు కావాలనే తమను లాగారని, ఇష్టానుసారం వ్యవహరించారని మహిళా ఎమ్మెల్యేలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకపోతే తాము కిందపడిపోయేవాళ్లమని పేర్కొన్నారు.
మహిళా ఎమ్మెల్యేలపై దాడిపై చర్చ ఏదీ?
హరీశ్‌రావు, కేటీఆర్ చుట్టూ మహిళా పోలీసులను, తమ చుట్టూ పురుష పోలీసులను మోహరించి వివక్ష చూపారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ అంశంపై చర్చిస్తున్న కాంగ్రెస్ నేతలు, తమపై జరిగిన ఘటనపై ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు.
మహిళల ఆత్మగౌరవం తెలంగాణ గౌరవం కాదా?
దళితుల ఆత్మగౌరవం తెలంగాణ గౌరవమని భట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేస్తూ, మహిళల ఆత్మగౌరవం కూడా తెలంగాణ గౌరవమే కదా అని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తమపై జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్
అసెంబ్లీ ప్రాంగణంలో తమపై దాడి జరిగినా సభలో ఒక్క ప్రకటన కూడా చేయలేదని వారు ఆరోపించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
స్పీకర్ బాధపడ్డారని తెలుసుకున్న కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని తమకు చెప్పారని మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు. స్పీకర్‌ను కలిసి తమ బాధను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మూడు రోజులుగా మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
