
D News: Sept 9: నాగర్ కర్నూల్ జిల్లాలో 255 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
నాగర్ కర్నూల్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అచంపేట్, బల్మూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 255 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 21, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 148 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 107 ఆయా పోస్టులు కలిపి మొత్తం 255 పోస్టులు ఉన్నాయి.
ప్రాజెక్టుల వారీగా ఖాళీలు
అచంపేట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 31 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 41 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బల్మూర్ ప్రాజెక్టులో 36 టీచర్, 28 ఆయా పోస్టులు ఉన్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టులో 21 టీచర్, 17 ఆయా పోస్టులు, కొల్లాపూర్ ప్రాజెక్టులో 22 టీచర్, 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నాగర్ కర్నూల్ ప్రాజెక్టు పరిధిలో 33 టీచర్, 9 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు.
విద్యార్హత
అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పరిస్థితుల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితి, అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగుల్లో వినికిడి పరికరాల సహాయంతో వినగలిగే వారు, అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించగలిగే వారు, అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రాథమిక విద్యాబోధన, పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించగలిగే మహిళా అభ్యర్థులు అర్హులు.
స్థానికత నిబంధనలు
అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి దానికి గరిష్ఠంగా 10 మార్కులు కేటాయిస్తారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది. అదనంగా వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 21 సెప్టెంబరు 2026. అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.
అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలు
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ లేదా వయసు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్మీడియట్ లేదా ఆపై విద్యార్హతకు సంబంధించిన మార్కుల జాబితా, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దివ్యాంగ అభ్యర్థులు సదరం సర్టిఫికేట్, వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథ అభ్యర్థులు అనాథ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
