
D News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మరో స్థాయికి చేరిందా? ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాకా’ సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బన్నీకి రెమ్యూనరేషన్‌గా సుమారు రూ.150 కోట్లు, సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో 33 శాతం వాటా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటినీ కలిపితే ఆయనకు దక్కే మొత్తం రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని లెక్కలు వినిపిస్తున్నాయి.
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ మార్కెట్ మరింత పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ సిరీస్‌తో ఆయన పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకునే విధానం వల్ల ఆయన ఒక్కో సినిమాకు అందుకునే మొత్తం భారీగా పెరిగిందనే టాక్ ఉంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘రాకా’ కోసం బన్నీ ఎక్కువ కాల్షీట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో షూటింగ్ కూడా సుదీర్ఘంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో ప్రభాస్, విజయ్, రజనీకాంత్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ల పేర్లు ఇప్పటికే వినిపిస్తుంటాయి. అయితే రూ.300 కోట్ల ప్యాకేజీ నిజమైతే.. అల్లు అర్జున్ దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా నిలిచే అవకాశం ఉంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల లెక్కలు మాత్రమే. ‘రాకా’ విడుదల తర్వాత బన్నీ రెమ్యూనరేషన్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
