
D News: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోని పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వాటిలోని పాటలు మాత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. అలాంటి చిత్రాల్లో ‘పౌర్ణమి’ కూడా ఒకటి. ప్రభాస్, త్రిష, ఛార్మి కౌర్ నటించిన ఈ సినిమా 2006లో విడుదలైంది.
ఈ చిత్రంలోని ‘భరత వేదముగా’ పాట తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ పాటకు చైనాకు చెందిన ఓ డ్యాన్సర్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న వీడియోలో మీరా వాంగ్ అనే చైనీస్ డ్యాన్సర్ ‘భరత వేదముగా’ పాటకు భారతీయ శాస్త్రీయ నృత్య శైలిలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. పాటకు తగ్గట్టుగా ఆమె చేసిన హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగు తెలియని దేశానికి చెందిన డ్యాన్సర్ తెలుగు పాటపై ఇంత ఆసక్తి చూపించడం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
తెలుగు పాటలపై చైనా డ్యాన్సర్ ఆసక్తి
మీరా వాంగ్‌కు భారతీయ శాస్త్రీయ నృత్యంపై మంచి ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భారత్‌ను సందర్శించకపోయినా.. అనంతపురానికి చెందిన అలా వేణుగోపాల్ వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తన నృత్య ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అంతేకాదు.. ‘మాయాబజార్’లోని ‘అహా నా పెళ్లంట’ పాటకు కూడా ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు సినిమా పాటలు, భారతీయ నృత్యంపై ఆమెకున్న ఆసక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
