
D News: హీరో కార్తీ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్దార్ 2’ విడుదలకు సిద్ధమైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా.. ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ తన కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పారు. ఇలాంటి గూఢచారి పాత్ర తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
‘ఇండియన్’ సినిమా కమల్‌హాసన్‌గారికి ఎంత ప్రత్యేకమో.. తనకు ‘సర్దార్’ అంతే ప్రత్యేకమని కార్తీ పేర్కొన్నారు. ‘సర్దార్’ తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుందని గుర్తుచేస్తూ.. ఆ సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసి ‘సర్దార్ 2’ను థియేటర్లలో చూడాలని కోరారు.సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించిన నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్‌తో పాటు తెలుగులో విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున, సుప్రియ, శ్రీధర్‌లకు కార్తీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. కార్తీ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ‘ఆవారా’, ‘ఖైదీ’, ‘సర్దార్’ వంటి సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని చెప్పారు. ‘సర్దార్ 2’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
