
D Educt: Sept 8: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ‘నీట్ యూజీ-2026’ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 7న యాజమాన్య కోటా ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 7,052 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరంతా ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ, సీ కేటగిరీల కింద సీట్లు పొందేందుకు అర్హులుగా పేర్కొంది.
ప్రొవిజినల్ మెరిట్ జాబితాపై అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 9న మధ్యాహ్నం 12 గంటలలోపు సంబంధిత ధ్రువపత్రాలతో వర్సిటీని సంప్రదించాలని అధికారులు సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, బీడీఎస్ అభ్యర్థులకు కన్వీనర్ కోటాలో కళాశాలల వారీగా సీట్ల కేటాయింపు జాబితాను కూడా వర్సిటీ సెప్టెంబరు 7న విడుదల చేసింది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 11న సాయంత్రం 4 గంటలలోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి బీడీఎస్ తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ఎండీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు సంబంధించి 399 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 9లోపు తెలియజేయాలని వర్సిటీ సూచించింది.
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎండీఎస్ ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.
