
D News: Sept 8: ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టుల నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ద్వారా చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీలోగా 913 ఆశా వర్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ పోస్టులకు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి (టెన్త్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారని అధికారులు వెల్లడించారు.
ఆశా వర్కర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.10,000 చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నారు. అర్హత, స్థానికత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
