
D News: మలయాళ బ్యూటీ మమితా బైజు పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టీ.. ఇప్పుడు వరుస విజయాలతో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోయిన్ల జాబితాలో మమితా బైజు చోటు సంపాదించుకున్నట్లు సమాచారం.
ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, ఆలియా భట్ మాత్రమే ఇలాంటి ఫీట్ సాధించారు. 2013లో దీపికా నటించిన ‘యే జవానీ హై దీవానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘రామ్ లీలా’ చిత్రాలు రూ.200 కోట్ల మార్క్‌ను దాటాయి. అలాగే 2022లో ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలు కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.

ఇప్పుడు వారి సరసన మమితా బైజు పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ‘ప్రేమలు’తో ఒక్కసారిగా యూత్ హార్ట్‌థ్రోబ్‌గా మారిన ఆమె.. ఆ తర్వాత ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ‘జన నాయగన్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా భారీ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఆగస్టులో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సుమారు రూ.240 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరో మలయాళ చిత్రం ‘బెత్లెహం కుడుంబ యూనిట్ టూ’ కూడా రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం.
ఈ లెక్కల ప్రకారం ఒకే ఏడాదిలో మమితా బైజు నటించిన మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లుగా చెబుతున్నారు. దీంతో దీపికా పదుకొణే, ఆలియా భట్ తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోయిన్గా మమితా బైజు పేరు తెరపైకి వచ్చింది.
మమితా కెరీర్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె నటించిన ఈ చిత్రాల్లో కొన్ని ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలు కావడం. విభిన్న కథలు, కొత్త తరహా పాత్రలు ఎంచుకుంటూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామకు క్రేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. గతంలో కోటి రూపాయల వరకు తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.అయితే వరుస విజయాలు మమితా బైజుకు ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ.. ఇదే స్థాయిలో విజయాలను కొనసాగించాలనే ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమెపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రాబోయే సినిమాలతో కూడా ఈ మలయాళ కుట్టీ ఇదే జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి.
