
D News: బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల అరెస్టులకు నిరసనగా మెదక్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బస్సు డిపో రోడ్డుపై భారీ రాస్తారోకో నిర్వహించారు.
మెదక్‌లో బీఆర్‌ఎస్ భారీ రాస్తారోకో
మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా?
పద్మ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం, వాటి అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు.
అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం
హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులను అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని విమర్శించారు.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల తీరుపై విమర్శలు
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను అడ్డుకున్న తీరును తప్పుబడుతూ మహిళా ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు
ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ప్రజల గొంతును నొక్కలేరని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్ చౌదరి చరిత తదితరులు పాల్గొన్నారు.
